ఏక్ దం న్యూస్, కరీంనగర్ :
శనివారం మార్కెట్ పరిధిలో కల్తీ కారంపొడి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో అనుమానాస్పద సుగంధ ద్రవ్యాల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని శనివారం మార్కెట్లో గౌరిశెట్టి రమేష్, సిద్ధంశెట్టి చక్రపాణికి చెందిన కిరాణా, సుగంధ ద్రవ్యాల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. సోదాల్లో సుమారు 47 బస్తాల కారంపొడి (ప్రతి బస్తా 50 కిలోలు), రెండు బస్తాల పసుపు, ఒక బస్తా ధనియాల పొడిని గుర్తించారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు సంబంధిత స్టాక్‌ను సీజ్ చేయడంతో పాటు, ఆ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్, ఎస్సైలు మామిడాల సురేందర్, శ్రీకాంత్, కానిస్టేబుల్ సాయిదీప్ పాల్గొన్నారు.